ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలుపుదల (స్టే) చేసింది. దీంతో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతలకు బిగ్ రిలీఫ్ లభించినట్లు అయింది. వైఎస్ షర్మిలతో పాటు ఇతరులపై దాఖలైన కోర్టు దిక్కరణ కేసులపై కూడా సుప్రీం కోర్టు స్టే విధించింది.

ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తావించవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు భావ ప్రకటన స్వేచ్చకు విరుద్దంగా ఉన్నాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కడప లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య అంశాన్ని పదేపదే ప్రస్తావించారు.

వివేకా హత్య కేసు నిందితుడికే సీఎం జగన్ టికెట్ ఇవ్వడం వల్ల తాను న్యాయం కోసం పోటీ చేస్తున్నట్లుగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసులో సూత్రధారులుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి లు ఉన్నారనీ, వీరు నిందితులని సీబీఐ యే స్వయంగా పేర్కొందని విమర్శలు గుప్పించారు.

వైఎస్ షర్మిలతో పాటు నర్రెడ్డి సునీత ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచార సభలో పదేపదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో  కడప జిల్లాలోని ఓ వైసీపీ నాయకుడు స్థానిక జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. పిటిషన్ ను విచారించిన కోర్టు .. వివేకా హత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించవద్దంటూ కోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వీరు ఎన్నికల ప్రచార సభల్లో ఆ అంశంపై మాట్లాడటంతో కోర్టు దిక్కరణ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కడప కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వైఎస్ షర్మిల, సునీత ముందుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే షర్మిల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో షర్మిల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్దంగా వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్చకు హరించేలా ఉన్నాయని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని ఆక్షేపించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ .. తదిపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *