ఎన్నికల రోజు, ఆ తర్వాతి రోజు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈసీ ఆదేశాలతో ఎస్పీ బింధు మాధవ్ ను సస్పెండ్ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ శివశంకర్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు.

ఈ తరుణంలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నెల 14న మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.

అయితే గురువారం రాత్రి నుండి ఎమ్మెల్యే, ఆయన సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉన్నప్పటికీ వారి కళ్లుగప్పి వెళ్లిపోయారు. వారికి రక్షణగా ఉన్న గన్ మెన్ లను కూడా వదిలివేసి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తొంది. ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి  వెళ్లిన సమాచారాన్ని ఆయన గన్ మెన్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కారంపూడి ఘటన నేపథ్యంలో ఈసీ చర్యలతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో .. పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి విశ్రాంతి కోసమే హైదరాబాద్ వెళ్లారని వైసీపీ నేతలు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *