దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు చేశారు. పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు అయ్యింది. పోలీసుల అదుపులో ఉన్న తన అనుచరుడిని బలవంతంగా బయటకు తీసుకొని వెళ్లడంతో చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్ తో పాటు అతని అనుచరులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అధికారుల విధులకు ఆటంకం కల్గించడం, స్టేషన్ లో దౌర్జన్యం చేయడంతో 224, 225, 353, 143 రెడ్ విత్ 149 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈ నెల 13న పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవ రావు కుమారుడు చలపాటి రవిపై తాళ్లూరి రాజశేఖర్ దాడి చేశారని పోలీసులకు పిర్యాదు అందింది. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పెదవేగి పోలీసులు..  బుధవారం రాజశేఖర్ ను పోలీసు స్టేషన్ కు రమ్మని కబురు చేశారు. దీంతో నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతని తండ్రి డేవిడ్ పెదవేగి పోలీస్ స్టేషన్ కు గురువారం వెళ్లారు. పోలీసులు అతనిపై హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ఈ విషయాన్ని రాజశేఖర్ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి చేరవేయడంతో ఆయన తన అనుచరులతో కలిసి స్టేషన్ కు వెళ్లారు. సీఐ, ఎస్ఐలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ లో ఉన్న తన అనుచరుడు రాజశేఖర్ ను తీసుకువెళ్లిపోయారు. దీంతో చింతమనేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ పై 90కిపైగా కేసులు ఉన్నాయి. తాజాగా చింతమనేనిపై మరో కేసు నమోదు కావడంతో సెంచరీకి చేరువ అవుతున్నారంటూ కామెంట్స్ వినబడుతున్నాయి.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *